లతికా చక్రవర్తి వయసు 90 ఏళ్లు. ఈ వయసులో ఇంక పనులేం చేస్తారు.. ‘కృష్ణా, రామా.. అనుకుంటూ రోజులు వెళ్లబుచ్చక..’ అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ బామ్మ భారతదేశం నలుమూలలా ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైనపాత చేనేత చీరలు, కుర్తాలు, బట్టలు సేకరించి వాటితో అందమైన ‘పొట్లి’ బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు.చేత్తో పట్టుకునే సంచులు, పర్సులను రీసైక్లింగ్ చేయడం అంటే ఈ బామ్మకు మహా ఇష్టం. ‘‘ఆడవాళ్లు ప్రతిబ్యాగ్‌తోనూ ఒక బంధాన్ని, ఓ ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు’’ అని చెబుతుంది. ఏ తరానికైనా పనికివచ్చే ఎన్నోముచ్చట్లతో పాటు, పనే దైవంగా భావించాలని చెబుతున్న ఈ బామ్మ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
లతిక 1930లో అస్సాంలోని ధుబ్రి పట్టణంలో జన్మించారు. ‘‘చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదాన్ని. కానీ, మా కుటుంబ సంప్రదాయ పద్ధతులు పై చదువులకు వెళ్లకుండా నన్ను అడ్డుకున్నాయి. కాలేజీలో చేరకుండానే కృష్ణ లాల్ చక్రవర్తితో పెళ్లైంది. తను సర్వే ఆఫ్ ఇండియాలో సర్వేయర్‌గా చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తను ఏ రాష్ట్రానికి వెళితే నేనూ అక్కడికి వెళ్లాను. బయటకు వెళ్లి గుర్తింపు తెచ్చే పనులు చేయాలని ఉండేది. కానీ, నా భర్తకు నేను బయటకు వెళ్లి సంపాదించడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆలనా పాలనతో ఇంట్లోనే ఉండిపోయాను. కానీ, నా జీవితం ఇలాగే నాలుగ్గోడల మధ్య ఉండిపోకూడదు అనిపించేది. ఒక ఏడాది ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో టీచర్‌గా పనిచేయాలనే ఆలోచనతో తొలిసారి బయటికి అడుగుపెట్టాను. పనిలో ఉన్న ఆనందం, స్వయంకృషితో సంపాదించే డబ్బు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటిపట్టున ఉండాలనే ఆలోచన కూడా చేయలేదు. మా రోజులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా అప్పుడు చాలా వస్తువుల అవసరం లేదు. ఒకసారి వాడిన వస్తువులును తిరిగి చక్కగా ఉపయోగించుకునేవాళ్లం. ఎలాంటి భేషజాలు లేవు. ఒకరితో పోల్చి చూసుకోవడం ఉండేది కాదు. దీంతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు లతిక.